Tuesday, 9 February 2016

బి ఎస్ ఎన్ ఎల్ ను, పెన్షన్ ను కాపాడుకునేందుకు ఉద్యమించుదాం


తిరుపతి లో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత మహాసభ పిలుపు
టెలికాం డిపార్ట్మెంటు నుండి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య దేశ వ్యాపితముగా 2 లక్షలమంది పైనే వుంటుంది. వీరిలో టెలికాం డిపార్ట్మెంటులో చేసి 1.10.2000 లోగా  రిటైరయిన వారు, ఆ తరువాత బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారు వున్నారు. అత్యధికులు బి ఎస్  ఎన్ ఎల్ లో రిటైరయిన  వారే. వీరి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ (ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి) లో 23000  మంది వున్నారు. ఇది దాదాపు బి ఎస్ ఎన్ ఎల్ లో సర్వీసులో వున్న వారితో సమానం. పెన్షనర్ల సంఖ్య పెరుగుతుండటం తో పాటు ప్రభుత్వ విధానాల వలన వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
వాజపాయి ప్రభుత్వము 1.10.2000 న అప్పటి వరకు టెలికాం డిపార్ట్మెంటు అధీనం లో నడుస్తున్న టెలికాం సర్వీసులను నిర్వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పేరుతో ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. సమాజ శ్రేయస్సు రీత్యా  అందించే సేవలకు వచ్చే నష్టాలకు పూర్తి పరిహారం చెల్లించి బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు కాకుండా కాపాడతామని హామీ యిచ్చింది. అప్పటివరకూ డి ఓ టి లో ప్రభుత్వ ఉద్యోగులుగా వుండి  1.10.2000 నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమై ప్రభుత్వ ఉద్యోగి హోదాను కోల్పోయిన ఉద్యోగులందరికి డి ఓ టి  మరియు బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసు మొత్తం కలిపి ప్రభుత్వ రూల్సు  ప్రకారం ప్రభుత్వమే పెన్షన్ చెల్లిస్తుందని హామీ యిచ్చింది.
కానీ వెంటనే ఈ రెండు హామీలకు తూట్లు పొడిచే కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై బిఎస్ఎన్ఎల్ కు వచ్చే నష్టాలకు ఇచ్చే పరిహారాన్ని కొద్ది సంవత్సరాలకే పరిమితం చేసే “ప్యాకేజి” విధానాన్ని ప్రకటించింది. మరో వంక ప్రయివేటు టెలికాం కంపెనీలకు మొబైల్ సర్వీసుల నిర్వహణకు 1994 నుండే లైసెన్సులిచ్చిన ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు మొబైల్ సర్వీసులందించేందుకు 2002 నుండి మాత్రమే  అనుమతించి వెనుకబడేలా చేసింది. మొబైల్ సర్వీసులకు అవసరమయిన స్పెక్ట్రమ్ కేటాయింపులలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు అనేక అక్రమ రాయితిలిచ్చింది. బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బ తీసేందుకు వాజపాయి ప్రభుత్వము అనుసరించిన ఈ విధానాలను ఆ తరువాత వచ్చిన యు పి ఏ ప్రభుత్వము కొనసాగిస్తూ వచ్చింది. వాజపాయి హయాములో ప్రయివేటు టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయింపులలో జరిగిన అక్రమాలు మరింత పెద్ద ఎత్తున పెరిగి యు పి ఏ హయాములో నాటి కమ్యూనికేషన్సు మంత్రి ఏ.రాజా ద్వారా జరిగి “2 జి కుంభకోణం” గా పేరొందాయి. ఇంతేగాక మొబైల్ రంగం లో కొద్ది కాలం లోనే ఎయిర్టెల్ తో పోటీగా సర్వీసులిస్తున్న బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బతీసేందుకు మొబైల్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొననీయకుండా బి ఎస్ ఎన్ ఎల్ కు అనేక ఆటంకాలు సృష్టించి 5వ స్థానానికి దిగజారేలా చేసింది. వాజపాయి ప్రభుత్వము ప్రకటించిన “ప్యాకేజీ” విధానాన్ని దాని కాల పరిమితి ముగియగానే 2006-07 నుండి ఆపు చేసి గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చే నష్టాలకు పరిహారం చెల్లించటం ఆపి వేసింది. బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ఉచితముగా ఇవ్వాలనే విధాన నిర్ణయానికి భిన్నముగా 3జి మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ పేరుతో బి ఎస్ ఎన్ ఎల్ నుండి ఋ.18500 కోట్లు వసూలు చేసి దాని వద్ద వున్న నగదు నిల్వలను హరించి వేసింది. దీనికి తోడు బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు నిర్వాకం తోడయింది. 2013-14 లో బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టం రు. 14000 కోట్లు కాగా నికర నష్టం రు.7019 కోట్లే. ఇందులో గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టం సుమారు రు.10000 కోట్లు వుంటుంది. ఇచ్చిన హామీ ప్రకారం ఈ నష్టానికి పరిహారం ఇస్తే బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు వచ్చే సమస్య వుండదు. ఈ విధముగా ప్రభుత్వ విధానాల కారణముగా బి ఎస్ ఎన్ ఎల్ 2009-10 నుండి నష్టాలతో నడుస్తున్నది. మోడి ప్రభుత్వాము బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు కలిగించే ఈ  విధానాలు కొనసాగించటమే గాక బి ఎస్ ఎన్ ఎల్ నుండి 62000 మొబైల్ సర్వీసుల టవర్సు విడగొట్టి విడిగా ఒక టవర్ కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్రమముగా దానిని ప్రయివేటు పరం చేయటమే  అసలు ఉద్దేశం. డిజిటల్ ఇండియా కార్యక్రమం లో భాగముగా బి ఎస్ ఎన్ ఎల్ కు అప్పగించిన నేషనల్ ఆప్టిక్ ఫైబర్ లేయింగ్ పనిని దానినుండి తప్పించి ప్రయివేటు కంపెనీలకు అప్పగించేందుకు పావులు కడుపుతున్నది.
బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు రావాటం వలన  డి ఓ టి లో ఆ తరువాత బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు విషయములో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాజపాయి ప్రభుత్వ హయాములోనే డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు  కావాల్సిన నిధుల  భారాన్ని బి ఎస్ ఎన్ ఎల్ పై మోపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చివరికి 2006 లో ప్రభుత్వము ఈ విషయములో కేబినెట్ ఆమోదముతో ఒక ఆర్డరు జారీ చేసింది. దీని ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఎం టి ఎన్ ఎల్ ల నుండి  ప్రభుత్వానికి లభించే లైసెన్సు ఫీజు, డివిడెండ్లు మరియు బి ఎస్ ఎన్ ఎల్ నుండి లభించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, మరియు సర్వీసు పన్ను—వీటన్నింటి మొత్తము లో  60 సాతమే  పెన్షన్ ఖర్చుగా ప్రభుత్వము భరిస్తుందని, అంతకు మించిన మొత్తాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలని  ఈ ఆర్డర్ లో ఆదేశించింది. 2011-12 నుండి పెన్షన్ ఖర్చు ఈ 60 శాతం మించి పోయింది.
మరో వంక వాజపాయి ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ కు పెన్షన్ సవరణ జరుగుతుందనే ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి 1.1.2007నుండి  బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు 68.8 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం వేతన  సవరణ అమలులోకి వచ్చిన అనంతరం పెన్షనర్సుకు ఆ ప్రకారం పెన్షన్ సవరణ చేసేందుకు నాటి యు పి ఏ ప్రభుత్వము మొదట అంగీకరించలేదు. ఆ పరిస్థితిలో బి ఎస్ ఎన్ ఎల్ మరియు డి ఓ టి పెన్షనర్సు కు  ఎదురవుతున్న సమస్యలపై పోరాడేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో 21.10.2009 న న్యూ ఢిల్లీలో జరిగిన అఖిల భారత మహాసభలో ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్” (ఏ ఐ బి డి పి ఏ) ఏర్పడింది. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏ ఐ బి డి పి ఏ ల చొరవతో జరిగిన  ఉద్యమం వలన చివరికి ప్రభుత్వము 15.3.2011న 1.1.2007 కి ముంది రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 1.1.2007 నుండి బేసిక్ పెన్షన్ కు 68.8 శాతం డి ఏ కలిపి ఆ మొత్తం పై  30 శాతం వెయిటేజి కలిపి పెన్షన్ రివైజ్ చేసేందుకు  ఆర్డర్సు ఇచ్చింది.
ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో 1.1.2007 నుండి జరిగిన వేతన సవరణ 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం జరగగా బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు,  నష్టాలు వస్తున్నాయనే సాకుతో 68.8 శాతం డి ఏ మెర్జర్ పై మాత్రమే మొదట వేతన సవరణ చేసింది. చివరికి బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో జరిగిన ఐక్య ఉద్యమం వలన 78.2 శాతం డి ఏ మెర్జర్ పై వేతన సవరణకు అంగీకరిస్తూ 10.6.2013న ఆర్డర్సు ఇచ్చింది. కానీ 1.1.2007 నుండి 9.6.2013 వరకు చెల్లించాల్సిన బకాయిలను సంస్థకు నష్టాలు వస్తున్నాందున చెల్లించలేమని అన్నది.  ఇది 10.6.2013 తరువాత రిటైరయిన పెన్షనర్సుకు కూడా వర్తించింది. ఎందుకంటే వారికి రిటైరయ్యే ముందు  మూల వేతనం 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం చెల్లించబడింది గనుక. కానీ 1.1.2007నుండి 78.2 శాతం డి ఏ మెర్జరు అమలులోకి వచ్చినా 10.6.2013 లోగా రిటైరయిన వారికి వారు రిటైరయ్యేనాటికి  వున్న మూల వేతనం 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం చెల్లించబడలేదు కాబట్టి,  చెల్లించబడని మూల వేతనం పై పెన్షన్ రాదు కాబట్టి,  వారి విషయములో కేబినెట్ అనుమతి అవసరమని ప్రభుత్వము నిర్ణయించింది. ఇంతేగాక పెన్షన్ ఖర్చు,  పైన తెలియజేసిన 60 శాతం కు మించినందున ఆ విధముగా మించిన ఖర్చును బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించాలి కాబట్టి అది ఏ విధముగా చెల్లిస్తుందో చెప్పాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలియజేసింది. ఈ  విధముగా బి ఎస్ ఎన్ ఎల్ లో 1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది.  ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాలు  చేసిన పోరాటం ఫలితముగా అందుకు మంత్రి వర్గ అనుమతి కోసం తయారు చేయబడిన “కేబినెట్ నోట్”న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఇటీవలే డి ఓ టి కి వచ్చింది. దీనిని వెంటనే కేబినెట్ కు పంపించి ఆమోదింపజేయాలని పెన్షనర్లు,  ఉద్యోగులు కోరుతున్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలతో నడుస్తున్నందున ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అవుట్ పేషెంట్  ట్రీట్మెంటు కోసం మూడు మాసాలకొకసారి చెల్లించే మెడికల్ అలవెన్సును బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు ఆపు చేసింది. అవుట్ పేషెంట్  ట్రీట్మెంటుకు  బిల్సు పెడితే రూల్సు  లో వున్న పరిమితికి లోబడి చెల్లిస్తామని మేనేజిమెంటు అన్నది. కానీ రిటైరయిన  వారు ఎప్పటికప్పుడు ఆ విధముగా బిల్సు సమర్పించటం కష్టం కాబట్టి అలవెన్సు చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని పెన్షనర్లు కోరుతున్నారు.
పై సమస్యలకి తోడు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు మరో ముఖ్య సమస్య ఎదురవుతున్నది. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరగాలి. ఆ ప్రకారమే  పెన్షనర్సుకు పెన్షన్ సవరణ జరగాలి. కానీ ప్రభుత్వము ఆ విధముగా వేతన సవరణ తో పాటు పెన్షన్ సవరణ జరిగే విధముగా ఇంతవరకు అంగీకరించలేదు. ఇంతేగాక నష్టాలు కొనసాగితే వేతన సవరణ సాధ్యం కాదని ఇటీవలే బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి ఒక ప్రకటన చేశారు.  ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోతే పెన్షనర్సుకు పెన్షన్ సవరణ కూడా జరగని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయివేటీకరణ విధానాలలో భాగముగా బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడినందున ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక వంక కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మరియు పెన్షనర్సుకు  ఏడవ వేతన సంఘం సిఫార్సులు 1.1.2016 నుండి అమలు జరుగుతుండగా గతం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వున్న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 1.1.2017 నుండి జరగాల్సిన వేతన మరియు పెన్షన్ సవరణ విషయం లో అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు చేసే విధానాలను యజమానిగా వున్న ప్రభుత్వము అనుసరిస్తుండగా అందుకు వ్యతిరేకముగా పొరాడి నష్టాలనుండి బయటపడే ప్రయత్నాన్ని ఉద్యోగులు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వారితో పాటు పెన్షనర్లు చేసిన ఐక్య పోరాటాల ఫలితముగా కొంత మేరకు మొబైల్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొనటం జరిగింది. ఇటీవల కాలం లో కొత్తగా మొబైల్ సర్వీసు కనెక్షన్లు ఇచ్చే విషయములో బి ఎస్ ఎన్ ఎల్ చెప్పుకోతగిన పురోగతిని సాధించింది. 2014-15 లో బి ఎస్ ఎన్ ఎల్ కు నిర్వహణ లాభం ( వర్తమాన సంవత్సరపు ఆదాయం వ్యయం కన్నా ఎక్కువ) రు.672 కోట్లు వచ్చింది. కానీ ఎక్విప్మెంటు భవనాలు తదితరాల అర్రూగుదల ఖర్చు లెక్క అధికముగా చూపాల్సి వచ్చినందున రు. 8200 కోట్లు నికర నష్టం వచ్చింది. ఏమయినప్పటికి ప్రభుత్వ విధానాలు కొంత మారిటే బి ఎస్ ఎన్ ఎల్ లాభాలబాట పడుతుంది. కాబట్టి వేతన సవరణను పెన్షన్ సవరణను నిరాకర్రించే ఆలోచనను ప్రభుత్వము మరియు మేనేజిమెంటు విరమించాలి.
బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు ప్రత్యేకముగా ఏర్పడిన పై సమస్యలతో పాటు అసలు పెన్షన్ చెల్లించే బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకునే విధానం ప్రారంభం కావటం మరో పెద్ద సమస్య. ఇప్పటికే 1.1.2004 నుండి రిక్రూటయిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము పెన్షన్ చెల్లించే విధానం రద్దయింది. కాంగ్రెస్, బి జె పి లు కలిసి చేసిన పని ఇది. ఇంతేగాక కాంగ్రెస్ మరియు బి జె పి లు కలిసి పారమెంటులో ఆమోదించిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ దేవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రభుత్వము తన పెన్షనర్సుకు పెన్షన్ చెల్లించే బాధ్యతనుండి తప్పుకుని ఆ పనిని ప్రయివేటు పెన్షన్ ఫండ్ కంపెనీలకు అప్పగించవచ్చు. ఈ విధముగా ప్రభుత్వము పెన్షన్ చెల్లించే విధానానికి ముప్పు ఏర్పడింది. పెన్షన్ నిధులను ప్రయివేటు పరం, విదేశీ పరం చేయటమే ఈ విధానాల సారాంశం.
ఈ సమస్యలన్నింటి పై తిరుపతి లో 2016 ఫిబ్రవరి 2, 3 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ 2వ అఖిల భారత మహాసభ సమీక్షించింది. ఈ మహాసభ కు దేశ వ్యాపితముగా అన్ని  రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభకు ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. సి ఐ టి యు అఖిల భారత ఉపాధ్యక్షులు మరియు పార్లమెంటు సభ్యులు కా.టి.కె.రంగరాజన్ మహాసభను ప్రారంభించారు. ఏ ఐ బి డి పి ఏ ప్రధాన కార్యదర్శి కా. కె.జి.జయరాజ్ సమర్పించిన నివేదిక పై అన్ని  రాష్ట్రాలనుండి ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కా. పి.అభిమన్యు మరియు ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ (పెన్షనర్స్& రిటైరీస్) తరఫున కా.వి.ఏ.ఎన్.నంబూదిరి, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ ఎం ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కా.కె.రాఘవేంద్రన్  పాల్గొని సందేశం ఇచ్చారు. బిఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కలిపి) మరియు చిత్తూరు జిల్లా శాఖలు ఈ మహాసభ జయప్రదమయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. చిత్తూరు జిల్లా సి ఐ టి యు కార్యకర్తలు కూడా మహాసభ ఏర్పాట్లకు తోడ్పడి  కార్మిక వర్గ ఐక్యతను ఆచరణలో ప్రదర్శించారు. 

బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకముగా ఉద్యోగులతో కలిసి ఉద్యమించి బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుకోవాలని,  78.2 శాతం డి ఏ మెర్జర్ పై ప్రభుత్వము వెంటనే ఆర్డర్సు ఇవ్వాలని, మార్చి 10 న ఇందు కోసం ప్రదర్శనలు నిర్వహించాలని, 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు పెన్షనర్సుకు వేతన సవరణ మరియు పెన్షన్ సవరణ కు ప్రభుత్వము అంగీకరించాలని, ఈ లోగా డి ఏ ని బేసిక్ పెన్షన్ తో మెర్జీ చేయాలని,  మూడు నెలలకొకసారి చెల్లించే మెడికల్ అలవెన్సును పునరుద్ధరించాలని, పెన్షన్ ప్రయివేటీకరణ విధానాలను విరమించాలని, 60 సంవత్సరాలు దాటిన అన్నీ రంగాల కార్మికులకు ప్రజలకు  భద్రతతో కూడిన  పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మోడి హయాములో పెరుగుతున్న మతోన్మాదాన్ని వ్యతిరేకించి మత సామరస్యాన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక సరళీకరణ విధానాలకు వ్యతిరేకముగా కార్మిక వర్గం చేసే ఐక్య పోరాటాలలో బి ఎస్ ఎన్ ఎల్ మరియు డి ఓ టి పెన్షనర్లు భాగస్వాములవ్వాలని, సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం ల్చేసిన 12 డిమాంద్సు పై పెన్షనర్సులో విస్తృత ప్రచారం చేయాలని  మహాసభ తీర్మానించింది. పెన్షనర్లకు సంబంధించిన అనేక ఇతర సమస్యలపై తీర్మానాలను ఆమోదించింది. 

No comments:

Post a Comment