Tuesday, 12 August 2014

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల తరఫున 7వ వేతన సంఘానికి సమార్పించిన డిమాండ్లు

బీసీపీసీ (భారత్ సెంట్రల్ పెన్షనర్స్ కాన్ఫేడరేషన్) మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జె సి ఎం(నేషనల్ కవున్సిల్-స్టాఫ్ సైడ్) లు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై 7వ వేతన సంఘానికి సమర్పించిన మెమోరాండంలో వున్న ముఖ్య అంశాలు

(గమనిక: ఏఐబిడిపి, బి సి పి సి కి అనుబంధ సంఘం. ఈ డిమాండ్స్ ను రూపొందించటం లో ఏఐబిడిపిఏ సముచిత పాత్ర వహించింది)

1.     సుప్రీం కోర్టు డి.ఎస్.నకారా కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్ అనేది ప్రభుత్వము దయతో ఇచ్చేది కాదు. అది గతములో చేసిన సర్వీసుకు చెల్లింపు. పెన్షన్ అనేది చట్టబద్ధమయిన, పెన్షనర్ నుండి విడదీయలేని, న్యాయ పరముగా అమలు చేయదగిన హక్కు.

2.    సుప్రీం కోర్టు ఈ తీర్పులో చెప్పిన ప్రకారం పెన్షన్ స్కీము అందుబాటులో వున్న వనరులకు అనుగుణమయినదిగా వుండాలి. పెన్షనర్ తన జీవితాన్ని ఎటువంటి లోటూ లేకుండా స్వతంత్రముగా ఆత్మ గౌరవముతో కొనసాగించేందుకు తోడ్పడేదిగా వుండాలి. రిటైర్మెంటు కు ముందు నాటి జీవన ప్రమాణాన్ని కొనసాగించేందుకు తోడ్పడేదిగా వుండాలి.

3.    పెన్షన్ లెక్కింపుకు ప్రాతిపదికగా వుండే ఇమాల్యుమెన్ట్సుగా బేసిక్ పే ని మాత్రమే పరిగణించటం సరి కాదు. గ్రాట్యువిటీకి డి ఏ ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. కాబట్టి పెన్షన్ లెక్కింపుకు ప్రాతిపదికగా వుండే ఇమాల్యుమెంట్స్ లో బేసిక్ పే తో పాటు స్పెషల్ లేదా పర్సనల్ పే మరియు డి ఏ ని కూడా కలపాలి.

4.    ఆఖరు ఇంక్రిమెంటు ఇచ్చిన తేదీ తరువాత సంవత్సరం పూర్తి చేసి రిటైర్ అవుతున్న వారికి మరో ఇంక్రిమెంటు కలపాలి.

5.    ఆఖరు పది నెలల సగటు ఇమాల్యుమెంట్సు ప్రాతిపదికగా గానీ లేదా ఆఖరున డ్రా చేసిన ఇమాల్యుమెంట్సు  గాని ఏది లాభదాయకమయితే దానిని పెన్షన్ లెక్కింపు కొరకు ఇమాల్యుమెంట్సు తీసుకునే ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి.

6.    ప్రస్తుతం టెంపొరరీ స్టేటస్ లేబర్ సర్వీసులో సగాన్ని పెన్షన్ కొరకు సర్వీసుగా పరిగణిస్తున్నారు. అది కూడా ఆ టిఎస్ఎం కు రెగ్యులర్ ఉద్యోగం వస్తేనే లెక్కిస్తున్నారు. కానీ కొందరు టిఎస్ఎం లు రెగ్యులర్ కాకుండానే రిటైర్/రిట్రెంచ్  కావటం లేదా చనిపోవటం జరుగుతున్నది. కాబట్టి ఈ నిబంధనను మార్చాలి. టిఎస్ఎం అవటానికి ముందు క్యాజువల్ లేబర్ గా చేసిన సర్వీసులో సగాన్ని, టిఎస్ఎం పూర్తి సర్వీసును పెన్షన్ కోసం లెక్కించాలి. రెగ్యులర్ అపాయింటుమెంటు వచ్చినా రాకున్నా ఈ ప్రయోజనం లభించాలి.

7.    సర్వీసులో బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ కి ముందు సర్వీసును పెన్షన్ కోసం లెక్కించకూడదనే నిబంధనను రద్దు చేయాలి.

8.    20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తరువాత ఉద్యోగానికి రాజీనామా ఇస్తే దానిని వాలంటరీ రిటైర్మెంటుగా పరిగణించి తదనుగుణముగా పెన్షన్ ఇవ్వాలి.

9.    20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే ఫుల్ పెన్షన్ కు అర్హత లభిస్తుందనే నిబంధనని కొనసాగించాలి.

10. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అనేది పెన్షనర్ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆత్మ గౌరవముతో, రిటైర్మెంటుకు ముందునాటి జీవన స్థాయిని కొనసాగించేందుకు తోడ్పడే విధముగా వుండాలి. రిటైర్మెంటు అయిన సందర్భములో సాధారణముగా కుటుంబ సభ్యులు ఇద్దరు వుంటారు. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుని ఆఖరు వేతనం లేదా ఆఖరు పది నెలల సగటు వేతనం పై 67 శాతం ను పెన్షన్ గా ఇవ్వాలి(ఇప్పుడిస్తున్నది 50 శాతం). ఫ్రాన్సు లో ఆఖరు 6 నెలల సగటు వేతనం లో 75 శాతాన్ని, శ్రీలంక లో ఆఖరు సంవత్సరం సగటు వేతనం లో 85 నుండి 90 శాతం వరకూ పెన్షన్ ఇస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఆఖరు వేతనం లో 80 శాతం పెన్షన్ ఇస్తున్నారు.

11.  రిటైరయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగి సగటున 18 నుండి 22 సంవత్సరాలు జీవించే అవకాశం వుంది. కాబట్టి ఇప్పుడున్నట్లు 80 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత అదనపు పెన్షన్ ఇవ్వటం కాకుండా రిటైరయినప్పుడు 67 శాతం పెన్షన్ నిర్ణయించి,  65 సంవత్సరాల వయసు నిండిన అనంతరం 70%, 70 సంవత్సరాలు నిండిన అనంతరం 75 శాతం, 75 సంవత్సరాల వయసు అనంతరం 75 శాతం, 80 సంవత్సరాలు నిండిన అనంతరం 85 శాతం, 85 సంవత్సరాల వయసు తరువాత 90 శాతం, 90 సంవత్సరాల వయసు తరువాత 100 శాతం పెన్షన్ ఇవ్వాలి.

12.  కనీస పెన్షన్ పే స్కేలు మినిమమ్ కు సమంగా వుండాలి.

13.  డియర్నెస్ కంపెన్సేషన్ సర్వీసులో వున్న ఉద్యోగులకు ఇచ్చే డిఏ తో సమంగా ఇస్తున్న విధానాన్నే కొనసాగించాలి. కానీ నిర్దిష్ట కాలవ్యవధిలో డియర్నెస్ కంపెన్సేషన్ ను బేసిక్ పెన్షన్ లో కలపాలి.

14.  డియర్నెస్ రిలీఫ్ 50 శాతం కు చేరుకున్న అనంతరం బేసిక్ పెన్షన్ లో కలపాలని 5వ వేతన సంఘం సిఫార్సు చేసింది. కానీ 6వ వేతన సంఘం ఇందుకు విరుద్ధముగా డియర్నెస్ రిలీఫ్ ను బేసిక్ పెన్షన్ లో మెర్జి చేయవద్దని సిఫార్సు చేసింది. ఇది అన్యాయం. 1.1.2014 నాటికి డియర్నెస్ రిలీఫ్ 100 శాతం కు చేరుకున్నందున 1.1.2014 నాటి నుండి 100 శాతం డియర్నెస్ రిలీఫ్ ను బేసిక్ పెన్షన్ తో కలిపే విధముగా మధ్యంతర సిఫార్సు ఇవ్వాలీ.

15.  7 వ వేతన సంఘాన్ని ప్రభుత్వము సెప్టెంబరు 2013 న ప్రకటించింది కాబట్టి అప్పటి నుండి బేసిక్ పెన్షన్ లో 25 శాతాన్ని ఇంటరిమ్ రిలీఫ్ గా పెన్షనర్లందరికీ ఇవ్వాలని మధ్యంతర సిఫార్సు  చేయాలి.

16.  వేతనాన్ని, పెన్షన్ ను 5 సంవత్సరాలకొక సారి రివైజ్ చేయాలి.

17.  వేతన సవరణ తేదీకి ముందు రిటైరయిన పెన్షనర్ కు అతను/ఆమె వేతన సవరణ నాటికి ఉద్యోగములో వున్నట్లే భావించి,  రిటైరయ్యేనాటి పోస్టు ప్రాతిపదికగా వేతన సవరణ తేదీ నాటికి అతని/ఆమె వేతనాన్ని నోషనల్ గా ఫిక్స్ చేసి దాని ప్రకారం పెన్షన్ ను రివైజ్ చేసి, వేతన సవరణకి ముందు మరియు తరువాత రిటైరయ్యే వారి పెన్షన్ లో వ్యత్యాసం లేకుండా చూడాలి. వేతన సవరణ తో పాటు రివైజ్ అయ్యే పెన్షన్ రూల్సు వేతన సవరణకి ముందు రిటైరయిన వారికి వర్తింపజేయాలి.

18.  ప్రస్తుతం వున్న రూల్సు ప్రకారం  చనిపోయిన సందర్భములో చనిపోయినప్పటినుండి 7 సంవత్సరాలు లేదా చనిపోయిన పెన్షనర్ బతికి వున్నట్లయితే 67 సంవత్సరాల వయసు నిండే తేదీ వరకూ ఫ్యామిలీ పెన్షన్ ఆఖరు వేతనం లో 50 శాతం ను వృద్ధిపరచిన (ఎన్హాంస్డ్) ఫ్యామిలీ పెన్షన్ గా చెల్లిస్తున్నారు. ఆ తరువాత 30 శాతమే ఫ్యామిలీ పెన్షన్ గా చెల్లిస్తున్నారు.  కానీ ఉద్యోగి సర్వీసులో చనిపోయిన సందర్భములో చనిపోయిన తేదీ నుండి 10 సంవత్సరాల వరకూ వృద్ధిపరచిన ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ వివక్షతను రద్దు చేయాలి. సర్వీసులో చనిపోయినా, పెన్షనరుగా చనిపోయినా, చనిపోయిన తేదీ నుండి 10 సంవత్సరాలు వృద్ధిపరచిన ఫ్యామిలీ పెన్షన్ ను చెల్లించాలి. ఇది ఆఖరు వేతనం లో 67 శాతం వుండాలి. 10 సంవత్సరాలు అయిన తరువాత ఫ్యామిలీ పెన్షన్ ను 67 శాతం నుండి 50 శాతం కు తగ్గించవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్ కు 65 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఫ్యామిలీ పెన్షన్ లో 5శాతం, 70 సంవత్సరాల వయసు తరువాత 5 శాతం, 75 సంవత్సరాల వయసు తరువాత 5 శాతం, 80 సంవత్సరాల వయసు తరువాత 5 శాతం, 85 సంవత్సరాల వయసు తరువాత 10 శాతం, 90 సంవత్సరాల వయసు తరువాత 20 శాతం అదనపు పెన్షన్ చెల్లించాలి.

19.  డి సి ఆర్ జి   ని  ప్రస్తుతం పూర్తి చేసిన ప్రతి 6 నెలల సర్వీసుకు బేసిక్ పే లో 4వ వంతు చొప్పున, ఇమాల్యుమెంట్సు కు 16.5 రెట్లు పరిమితి మరియు రు.10 లక్షల పరిమితికి లోబడి చెల్లిస్తున్నారు. ఈ రెండు పరిమితులను రద్దు చేయాలి. రిటైరవుతున్న బ్యాంకు ఉద్యోగులకు పూర్తి చేసిన ప్రతి సంవత్సరం సర్వీసుకు ½ నెల వేతనం 33 సంవత్సరాల సర్వీసు పరిమితితో నిమిత్తం లేకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని  సంవత్సరాలకు చెల్లిస్తున్నారు. కాబట్టి 33 సంవత్సరాల సర్వీసు పరిమితిని రద్దు చేయాలి. ఇంతేగాక గ్రాట్యుటీ లెక్కకు రోజు వేతనాన్ని నెలకి 30 రోజుల లెక్కన కాకుండా 25 రోజుల లెక్కన లెక్కించాలి. ఆ ప్రకారం పూర్తి చేసిన ప్రతి సంవత్సరం సర్వీసుకు 15 రోజుల వేతనాన్ని గ్రాట్యుటీ  గా చెల్లించాలి. గ్రాట్యుటీ చట్టం లో నెలకి 26 రోజులే లెక్కగట్టి రోజు వేతనాన్ని నిర్ణయిస్తున్నందున కేంద్రప్రభుత్వోద్యోగులకు కూడా ఇదే విధముగా లెక్కించాలి.


20. ఇప్పుడున్న రూల్సు ప్రకారం బేసిక్ పెన్షన్ లో 40 శాతం వరకు కమ్యూటేషన్ ను అనుమతిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి రిటైరయిన నాటినుండి 15 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత లేదా 75 సంవత్సరాల వయసు నిండిన తరువాత, ఏది ముందయితే దాని ప్రకారం, కమ్యూటెడ్ పెన్షన్ విలువని పునరుద్ధరిస్తున్నారు. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రిటైరయిన 12 సంవత్సరాల తరువాత లేదా 70 సంవత్సరాల వయసు నిండిన తరువాత కమ్యూటెడ్ పెన్షన్ విలువని పునరుద్ధరిస్తున్నాయి.  కాబట్టి రిటైరయిన 10  సంవత్సరాల తరువాత లేదా 70 సంవత్సరాల వయసు తరువాత, ఏది ముందయితే దాని ప్రకారాం పెన్షన్ పూర్తి విలువని పునరుద్ధరించాలి.

21.  సుప్రీం కోర్టు ఇచ్చిన అనేక తీర్పుల ప్రకారం ఉద్యోగి/పెన్షనర్ ఆరోగ్య ప్రమాణం సాధ్యమయినంత ఉన్నత స్థాయిలో వుండాలి. రాజ్యాంగం లోని అధికరణం 21 ని అధికారణాలు 39, 41, 43 మరియు 48 లతో జోడించి చూసి,  ఇది ఉద్యోగి/పెన్షనర్  ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు గుర్తించింది. కన్స్యూమర్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చి సెంటర్ & ఇతరులు వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఏ ఐ ఆర్ 1995 ఎస్‌సి 922) కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు ఈ క్రింది విధముగా అన్నది:
“జీవించే హక్కు అంటే అర్థవంతముగా జీవించటం. ఇందులో విడదీయరాని  భాగం సంపూర్ణమయిన ఆరోగ్యముతో ఉత్సాహముగా వుండగలగటం. కాబట్టి సర్వీసులో వున్నప్పుడూ, రిటైరయిన తరువాతా ఆరోగ్యముగా వుండే హక్కూ మరియు ఆరోగ్య పరిరక్షణకు అవసరమయిన వైద్య సదుపాయం పొందే హక్కూ ఆత్మ గౌరవముతో అర్థవంతముగా, ప్రయోజనకరముగా జీవించే ప్రాథమిక హక్కులో భాగం. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ అనేది ఒక సంక్షేమ సదుపాయం మాత్రమే కాదు. అది ప్రాథమిక హక్కు.”

కాబట్టి పెన్షనర్లందరినీ, వారు రిటైర్ కావటానికి ముందున్న హోదాతో నిమిత్తం లేకుండా ఒకే తరగతిగా గుర్తించాలి. అందరికీ ఒకే స్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలి.  రిటైరయిన వారందరికీ కల్పించే వివిధ పెన్షన్ స్కీములలో జబ్బు రాకుండా నివారించేందుకు తీసుకునే చర్యలు అనివార్యమయిన భాగముగా వుండాలి. సి జి హెచ్ ఎస్ ను  మరియు ఆర్ ఇ ఎల్ హెచ్ ఎస్ ను మెరుగు పరచాలి. సి జి హెచ్ ఎస్ పరిధిలో వున్న ప్రాంతానికి వెలుపల వున్న వారికి సి ఎస్ ఏం ఏ రూల్సు 1944 ను వర్తింప చేయాలి.

22. నర్సింగ్ హోమ్ లు/ ఆల్ ఇండియా ప్రయివేట్ హాస్పిటల్సు/దయాగ్నాస్టిక్ సెంటర్సు లో వైద్య సదుపాయం పొందేందుకు  సి జి హెచ్ ఎస్ బెనిఫిషియరీ లను అనుమతించాలి. వైద్యం కోసం పెన్షనరు 2.5 కి.మీ మించి ఎక్కువ దూరము వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. సి జి హెచ్ ఎస్ స్కీమ్ ను ఎక్కువ ప్రాంతాలకు విస్తరింపజేయాలని 5వ వేతన సంఘం సిఫార్సు చేసినా అమలు కాలేదు. ఈ సిఫార్సును 7వ వేతన సంఘము కూడా చేయాలని కోరుతున్నాము.

23. పెన్షనర్లందరికి నగదు చెల్లింపు అవసరము లేని మరియు కాలాయాపన/గందరగోళము లేని విధముగా దేశములో వున్న అన్ని  ప్రభుత్వ ఆసుపత్రులలో/ప్రభుత్వ సహాయము పొందిన ఎన్ఏబిహెచ్ గుర్తింపు వున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో  సి జి హెచ్ ఎస్ గుర్తింపు పొందిన ఆసుపత్రులలో  వైద్య సదుపాయం లభించేందుకు వీలుగా  స్మార్ట్ కార్డ్ లు ఇవ్వాలి. ఎమర్జెన్సీ కేసులలో రిఫరెన్స్ అవసరం లేకుండా చూడాలి. ఎమర్జెన్సీ కాని  కేసులలో హాస్పిటలైజేషన్ కు రిఫర్ చేయటానికి వివిధ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో/హెల్త్ యూనిట్సు  లో పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్సు మరియు డాక్టర్లను ఆథరైజ్డ్ మెడికల్ అటెండెన్ట్సు గా గుర్తించాలి.

24. సర్వీసులో వుండగా సి జి హెచ్ ఎస్ లో లేని పి & టి ఉద్యోగులకు రిటైరయిన అనంతరం వారు కోరిన యెడల వారు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా సి జి హెచ్ ఎస్ ను వర్తింపజేయాలి. లేదా ఇందుకు ప్రత్యామ్నాయముగా సి ఎస్ (ఏం ఏ) రూల్సు, 1944 ను వర్తింపజేయాలి.

25. స్మార్ట్ కార్డు హోల్డర్లకు హేతుబద్ధమయిన వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించటానికి హాస్పిటల్స్ రెగ్యులేటరీ అథారిటీ ని ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో సి జి హెచ్ ఎస్ అనుమతించిన రేట్సు ను రివైజ్ చేసే అధికారం ఈ అథారిటికి ఇవ్వాలి. ఈ విధముగా చేసినట్లయితే ఎంపనేల్డ్ హాస్పిటల్సు లో వైద్యం చేయటాన్ని నిరాకరించే పరిస్థితి రాదు.


26. సి జి హెచ్ ఎస్ పరిధిలో లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న నెలకి రు.300 ఎఫ్ ఏం ఏ (ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్) ఏ మాత్రమూ సరిపోదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యములో వున్న ఇపిఎఫ్ ఆర్గనైజేషన్ లో 1.3.2013 నుండి నెలకి రు.2000లు ఎఫ్ ఏం ఏ చెల్లిస్తున్నారు. కాబట్టి పెన్షనర్లకు నెలకి రు.2000 ఎఫ్ ఏం ఏ చెల్లించాలి. దాని పై డి ఏ కూడా చెల్లించాలి. సి జి హెచ్ ఎస్ వున్న ప్రాంతాలలో కూడా పెన్షనర్ ఎవరయినా యునానీ లేదా ఆయుర్వేదిక్ లేదా హోమియో ట్రీట్మెంటు మాత్రమే తీసుకోదలిస్తే వారికి కూడా ఈ ఎఫ్ ఏం ఏ ఇవ్వాలి.

27. సి జి హెచ్ ఎస్ లేని ప్రాంతాలలో వున్న పెన్షనర్లకు సి ఎస్ (ఏం ఏ) రూల్సు 1944 ప్రకారం గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ ట్రీట్మెంటు తీసుకున్న సందర్భములో సంబంధిత డిపార్ట్మెంటు రియింబర్స్మెంటు ను చెల్లించాలి.

28. పెన్షన్, డియర్నెస్ రిలీఫ్ మరియు ఎఫ్ ఏం ఏ లపై ఆదాయ పన్ను విధించకూడదు. రిటైరయిన తరువాత సర్వీసులో వున్నంతగా తిరగరు కాబట్టి రిటైరయిన వారు ప్రభుత్వము కల్పించిన పౌర సదుపాయాలను అంతగా ఉపయోగించరు. కాబట్టి ఈ మినహాయింపునివ్వాలి. 5వ వేతన సంఘం ఇటువంటి మినహాయింపునిచ్చినా దానిని అమలు చేయలేదు. కాబట్టి 7వ వేతన సంఘం ఈ మినహాయింపును సిఫార్సు చేయాలి.


29. రాష్ట్ర హౌసింగ్ బోర్డులు, కేంద్ర హౌసింగ్ కార్పొరేషన్లు నిర్మించే గృహాలలో  10 శాతం పెన్షనర్లకు రిజర్వు చేయాలి. ఇన్స్టాల్మెంట్సు ప్రాతిపదికగా చెల్లించి కొనేందుకు అనుమతించాలి. అనేక చోట్ల స్టాఫ్ క్వార్టర్సు ఖాళీగా వుంటున్నాయి. వాటిని పెన్షనర్లకు లైసెన్సు ఫీజు మాత్రమే చెల్లించే ప్రాతిపదికన కేటాయించాలి. అదే విధముగా పట్టణ శివారు ప్రాంతాలలో పెన్షనర్లకు హేతుబద్ధమయిన మొత్తం చెల్లించే ప్రాతిపదికన డార్మిటరీ టైపు సింగిల్ రూమ్ నివాసాలను నిర్మించి ఇవ్వాలి. ఈ నివాస ప్రాంతాలలో కామన్ డైనింగ్ హాలు, లైబ్రరీ, సాంస్కృతిక కేంద్రం, ఆడిటోరియమ్, ప్రాథమిక వైద్య సదుపాయం, గ్రంధాలయం తదితర సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి స్కీములు రూపొందించి అమలు చేసే లోగా పెన్షనర్లకు సర్వీసులో వున్న ఉద్యోగులతో సమంగా హెచ్ ఆర్ ఏ చెల్లించాలి.

30. 60 సంవత్సరాలు వచ్చిన పురుషులను, 58 సంవతరాలు వచ్చిన స్త్రీలను సీనియర్ సిటిజన్స్ గా పరిగణించి రైల్వే శాఖ పురుషులకు 40 శాతం, స్త్రీలకు 50 శాతం ఛార్జీ తగ్గిస్తున్నది. రిటైరయిన ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలకొకసారి ఆల్ ఇండియా ట్రావెల్ కన్సెషన్ ను ఇవ్వాలని కోరుతున్నాము. ఇది టూరిజం విస్తరణకు తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది. పెన్షనర్లకు సంతోషాన్నిస్తుంది. పంజాబ్ ప్రభుత్వము రెండు సంవత్సరాలకొకసారి ట్రావెల్ కన్సెషన్ గా పెన్షనర్లకు ఒక నెల బేసిక్ పెన్షన్ ను చెల్లిస్తున్నది. ఇది 1/1/1990 నుండి అమలులో వున్నది. అయితే ధరలు పెరిగినందున పెన్షనర్లకు/ఫ్యామిలీ పెన్షనర్లకు  ట్రావెల్ కన్సెషన్ గా 3 నెలల బేసిక్ పెన్షన్ను రెండు సంవత్సరాలకొకసారి  చెల్లించాలాని కోరుతున్నాము.


31.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 29/6/2011న ప్రకటించిన ఆర్డరు ప్రకారం పెన్షనర్లకు/ఫ్యామిలీ పెన్షనర్లకు చనిపోయిన సందర్భముగా రు.10000లు డెత్ రిలీఫ్ ఫండ్ చెల్లిస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు చనిపోయిన సందర్భముగా రు.10000లు డెత్ రిలీఫ చెల్లించాలి.


32. పెన్షనర్ నుండి కంట్రిబ్యూషన్ వసూలు చేసి పెన్షనర్ చనిపోయిన సందర్భములో రు. 1,00,000 పెన్షనర్ కుటుంబానికి చెల్లించే విధముగా “ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్” ఏర్పాటు చేయాలి. తమిళ నాడు ప్రభుత్వము ఇటువంటి నిధి ని ఏర్పాటు చేసింది. పెన్షనర్ నుండి నెలకు రు. 80/- వసూలు చేసి పెన్షనర్ చనిపోయిన సందర్భముగా పెన్షనర్ కుటుంబానికి రు.50000/- చెల్లిస్తున్నారు. కాబట్టి దీనిని దృష్టిలో వుంచుకుని పెన్షనరు చనిపోయినప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ రు. 1,00,000/- చెల్లించే విధముగా తగిన ఏర్పాటు చేయాలి.

33. పెన్షన్ అదాలత్ లను అన్ని  డిపార్టుమెంటులు డివిజన్ స్థాయిలో 3 నెలలకొకసారి, రీజియన్ స్థాయిలో 6 నెలలకొక సారి, డిపార్ట్మెంటు స్థాయిలో సంవత్సరానికొకసారి, డిఓపిటి సహాయ మంత్రి స్థాయిలో రెండు సంవత్సరాలకొక సారి తప్పనిసరిగా నిర్వహించాలి. ఇందుకనుగుణముగా పెన్షన్ అదాలత్ పై 25.3.2011 న ఇచ్చిన ఆర్డర్ ను సవరించాలి.


34. ప్రస్తుతం పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వముతో పెన్షనర్ల అసోసియేషన్లు చర్చించేందుకు “స్కోవా” (SCOVA=స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్) అనే వేదికని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. కానీ ఇది అధికారికమయినది కాదు. అదే విధముగా పెన్షనర్ల అసోసియేషన్లకు అధికారికముగా గుర్తింపునిచ్చే విధానము లేదు. ప్రభుత్వము తనకి తోచిన పెన్షనర్స్ అసోసియేషన్లతో చర్చిస్తున్నది. పెన్షనర్ల అసోసియేషన్లలో కొన్నిటిని రొటేషన్ పద్ధతిలో స్కోవా సభ్యులుగా ప్రభుత్వము ఆహ్వానిస్తున్నది. వివిధ డిపార్ట్మెంట్ల పరిధిలో లెక్కలేనన్ని పెన్షనర్ల అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఏర్పడ్డాయి. కాబట్టి పెన్షనర్ల సమస్యలను చర్చినేందుకు అధికారికముగా ఒక సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్కోవా ను కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏర్పాటు చేసిన జెసిఏం నేషనల్ కవున్సిల్ వలే అప్గ్రేడ్ చేయాలి. స్కోవా పేరును “జాయింట్ నేషనల్ కవున్సిల్ ఆఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్” గా మార్చాలి. పెన్షనర్స్ అసోసియేషన్లకు గుర్తింపునిచ్చేందుకు ప్రత్యేకమయిన నిబంధనలను రూపొందించాలి. ఇప్పుడున్న ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్లు/ఫేడరేషనలను గుర్తించాలి. వాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకి ఇస్తున్న విధముగా సౌకర్యాలు కల్పించాలి. ఈ సంప్రదింపుల యంత్రాంగాన్ని రెండు స్థాయిలలో, డిపార్టుమెంటు స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి.

35. సిసిఎస్ (పెన్షన్) రూల్సు 1972 ను రాజ్యాంగం లోని అధికారణం 309 ప్రకారం ప్రభుత్వానికి  లభించిన అధికారం ప్రాతిపదికగా తయారు చేయటం జరిగింది. అంతేగానీ పెన్షన్ చట్టం, 1871 ప్రకారం కాదు. పెన్షనర్లకూ,  వలస పాలన కాలం నాటి ఈ 1871 చట్టానికీ సంబంధం లేకున్నా అది ఇంకా కొనసాగుతున్నది. ఈ చట్టాన్ని సవరిస్తామని 1981 లో ప్రభుత్వము పార్లమెంటులో అంగీకరించింది. గజేంద్ర గడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన లా కమిషన్ ఈపెన్షన్ చట్టం, 1871 ని సవరించాలని, మారిన పరిస్థితులకి అనుగుణముగా రూపొందించాలని 1972 లోనే సిఫార్స్ చేసింది. ఈ 1871 చట్టం లో వున్న ఈ క్రింది నిబంధనలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకముగా వున్నాయి:


అ) ఏ సివిల్ కోర్టూ అయినా సరే, పెన్షన్ పై ఎటువంటి కేసునూ అనుమతించ కూడదు. అలా అనుమతించేందుకు కలెక్టర్/ డిప్యూటీ కమిషనర్ సర్టిఫికేట్ కావాలి. కానీ కోర్టు పెన్షన్ విషయములో ప్రభుత్వ బాధ్యతను పెంచే ఎటువంటి ఉత్తర్వునూ ఇవ్వకూడదు.

ఈ క్రింది నిబంధనలు సి సి ఎస్(పెన్షన్) రూల్సు, 1972 కి విరుద్ధముగా వున్నాయి:
అ) పెన్షన్ క్లెయిమ్ ను కలెక్టర్/డిప్యూటీ కమిషనర్ కు సమర్పించాలి.
ఆ) పెన్షన్ చెల్లింపు కలెక్టర్/డిప్యూటీ కమిషనర్ ద్వారా జరగాలి
ఇంకా కాలం చెల్లిన అనేక నిబంధనలు ఈ 1871 చట్టం లో వున్నాయి.

36. ఈ కాలం చెల్లిన 1871 చట్టాన్నికొనసాగిస్తూ , సి సి ఎస్(పెన్షన్ రూల్స్) 1972  ని తెచ్చారు. ఆ తరువాత దానికి విరుద్ధముగా  ప్రభుత్వము 1.1.2004  తరువాత రిక్రూట్ అయిన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెలా వారి వేతనం  నుండి 10 శాతాన్ని పెన్షన్ కంట్రిబ్యూషన్ గా చెల్లించే నూతన పెన్షన్ విధానం, 2013 చట్టాన్ని తెచ్చింది. ఈ విధముగా కేంద్ర ప్రభుత్వోద్యోగులకు పరస్పర విరుద్ధమయిన మూడు రకాలయిన పెన్షన్ చట్టాలు పని చేస్తున్నాయి. కాలం చెల్లిన పెన్షన్ చట్టం, 1871 ని రద్దు చేయాలి. అదే విధముగా 1.1.2004 తరువాత రిక్రూటయిన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రతినెలా 10 శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను జీతం నుండి వసూలు చేయటం తో పాటు రిటైరయిన తరువాత పెన్షన్ కు గ్యారంటీ లేని విధముగా రూపొందించిన నష్టాదాయకమయిన నూతన పెన్షన్ చట్టం 2013 ను రద్దు చేసి వారిని కూడా సిసిఎస్(పెన్షన్) రూల్స్, 1972 పరిధిలోకి తేవాలి.

37. పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీఓ) ఫార్మాట్ అన్నీ డిపార్ట్మెంట్సులో ఒకే విధముగా వుండాలి. అందులో అర్హులయిన కుటుంబ సభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు కూడా వుండాలి.

(గమనిక: పెన్షన్ రుల్సులో 7వ పే కమిషన్ సిఫార్సు చేసే మార్పులను ప్రభుత్వము ఆమోదిస్తే అవి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన డి ఓ టి ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ్జ ఉద్యోగుల సంఘాలు అన్నీ కలిపి పెన్షన్ పై 7వ పే కమిషన్ కు సమర్పించిన మెమోరాండం లో వున్న డిమాండ్లు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు కూడా వర్తిస్తాయి)

బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల ప్రత్యేక సమస్యలపై 7వ వేతన సంఘానికి ఏఐబిడిపిఏ సమర్పించిన మెమోరాండం
7వ సెంట్రల్ పే కమిషన్ ఆహ్వానాన్ని అనుసరించి 23.7.2014న బిసిపిసి (భారత్ సెంట్రల్ పెన్షనర్స్ కాన్ఫెడరేషన్) నాయకులు కా. మహేశ్వరి(ప్రెసిడెంట్), కా.ఎస్.కె.వ్యాస్ (సెక్రెటరీ జనరల్), కా.విఏఎన్ నంబూదిరి (డిప్యూటీ సెక్రెటరీ జనరల్) లు 7వ పే కమిషన్ ను కలిసి పైన తెలియజేసిన కేంద్ర ప్రభుత్వా పెన్షనర్ల డిమాండ్సు పై చర్చించారు.  కా. నంబూదిరి, బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన డి ఓ టి ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ విషయం లో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. 78.2 శాతం ఐడిఏ మెర్జర్ ఆధారముగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ కు పెన్షన్ రివిజన్ వెంటనే జరపాల్సిన అవసరాన్ని వివరించారు. బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు ఎటువంటి అవరోధాలూ లేకుండా పెన్షన్ రివిజన్ కు ఏర్పాట్లు జరగాలని కోరారు. 7వ పే కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శ్రీ అశోక్ కుమార్ మాథుర్ మరియు ఇతర పే కమిషన్ సభ్యులు అందరూ ఈ చర్చలలో పాల్గొన్నారు. సమావేశం సమయం 45 నిమిషాలని ముందుగా నిర్ణయించినా గంటన్నర కొనసాగింది. పే కమిషన్ సభ్యులు నాయకులు చెప్పింది శ్రద్ధగా విన్నారు.  అనేక ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి నాయకులు సమర్థవంతముగా జవాబులు ఇచ్చారు. ఈ సందర్భముగా పే కమిషన్ ఛైర్మన్, బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు ప్రత్యేకముగా వున్న డిమాండ్స్ పై విడిగా ఒక మెమోరాండం ఇవ్వాలని సూచించారు.

29, 30 జులై 2014న కోయంబత్తూరులో జరిగిన ఏఐబిడిపిఏ కేంద్ర కార్యవర్గ సమావేశం పే కమిషన్ కు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల తరఫున ఇవ్వాల్సిన మెమోరాండం ను చర్చించి తుది రూపం ఇచ్చింది. ఈ మెమోరాండం ను 7వ పే కమిషన్ కు 31.7.2014న సమర్పించటం జరిగింది. ఈ మెమోరాండం లో వున్న డిమాండ్లు:

1.     కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల తరఫున బి సి పి సి (భారత్ సెంట్రల్ పెన్షనర్స్  కాన్ఫెడరేషన్), 7వ పే కమిషన్ కు సమర్పించిన డిమాండ్స్ ను ఆమోదించాలని ఏ ఐ బి డి పి ఏ కోరుతున్నది. [గమనిక: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జె సి ఏం(నేషనల్ కవున్సిల్) స్టాఫ్ సైడ్ కూడా ఇవే డిమాండ్స్ ను 7వ పే కమిషన్ కు సమర్పించింది] 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్సు కు ఇచ్చే ప్రయోజనకరమయిన సిఫార్సులు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 6వ పే కమిషన్ సిఫార్సులు అమలు చేసిన విధంగానే   అమలు చేయాలని కోరుతున్నాము.

2.    సిసిఎస్(పెన్షన్) రూల్స్ లో వున్న రూల్37-ఏ ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ లో వీలీనమయిన డిఓటి ఉద్యోగులకు రిటైరయిన తరువాత ఐడిఏ పే పై ప్రభుత్వమే పెన్షన్ చెల్లించాలి. కానీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన సందర్భములో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు తదనుగుణముగా  పెన్షన్ సవరణ జరగాలానే నిబంధన ఈ రూల్ లో లేదు. కాబట్టి 1.10.2000న సీడీఏ పే స్కేల్సు నుండి ఐ డి ఈ పే స్కేల్సు కు కన్వర్షన్ జరిగిన సందర్భములోనూ, 1.1.2007 న వేతన సవరణ జరిగిన సందర్భములోను అందుకనుగుణముగా పెన్షన్ సవరణ జరిగేందుకు కేబినెట్ అనుమతి పొందాల్సిన అవసరం ఏర్పడింది. అలా కాకుండా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన సందర్భం లో పెన్షనర్సు కు ఆటోమేటిక్ గా పెన్షన్ సవరణ జరగాలి.


3.    డిఓటి మరియు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు విషయములో ప్రభుత్వ బాధ్యతని బీఎస్ఎన్ఎల్ /ఎంటిఎన్ఎల్ లు ప్రభుత్వానికి  చెల్లించే లైసెన్సు ఫీజు మరియు డివిడెండ్లు అదే విధముగా బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్ను/ఎక్సైజ్ డ్యూటీ/సర్వీస్ చార్జి-వీటన్నింటి మొత్తములో 60 శాతానికే పరిమితం చేస్తూ మిగతా మొత్తాన్ని బిఎస్ఎన్ఎల్ భరించాలని ప్రభుత్వము ఇచ్చిన ఆర్డరును ఉపసంహరించాలి. పెన్షన్ ఖర్చు మొత్తం బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి.

4.    బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు బిఎస్ఎన్ఎల్ మేనేజిమెంటు ప్రతి నెలా వారి పే స్కేలు మ్యాగ్జిమమ్ పై ప్రభుత్వానికి పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నది. 6వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం అమలులోకి వచ్చిన ఆర్డర్సు ను అనుసరించి పే స్కేలు మ్యాగ్జిమామ్ పై కాకుండా ఉద్యోగికి చెల్లిస్తున్న బేసిక్ పే పై మాత్రమే పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఇదే రూల్ ను బి ఎస్ ఎన్ ఎల్ కు వర్తింపజేయాలి. ఆ విధముగా బి ఎస్ ఎన్ ఎల్ పై పెన్షన్ కంట్రిబ్యూషన్ భారాన్ని తగ్గించాలి.


5.    78.2% డిఏ మెర్జర్ ప్రకారం వేతన సవరణకు డిపిఈ ఇచ్చిన ఆర్డర్సును బిఎస్ఎన్ఎల్ అమలు చేసింది. కానీ ఇందుకనుగుణముగా 78.2% డిఏ మెర్జర్ పై పెన్షన్ సవరణను డిఓటి,  10.6.2013 తరువాత రిటైరయిన వారికి మాత్రమే అమలు చేసింది. 1.10.2000 నుండి 9.6.2013 లోగా రిటైరయిన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్సు కు దీనిని అమలు చేయలేదు. వీరికి కూడా వెంటనే పెన్షన్ సవరణను అమలు చేసి ఈ వివక్షతను తొలగించాలి.

6.    బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలను బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు కూడా అమలు చేయాలి.

7.    బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు సిజిహెచ్ఎస్ కు ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని 20.2.2014 ఆర్డర్ ద్వారా డిఓటి ఇచ్చింది. దీనిని బిఎస్ఎన్ఎల్ మేనేజిమెంటు 2.4.2014న సర్క్యులేట్ చేసింది. కానీ ఇందుకనుగుణముగా హెల్త్ మినిస్ట్రీనుండి ఆర్డర్సు రానందున, సి జి హెచ్ ఎస్ కు ఆప్షన్ ఇచ్చిన వారు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ ఎంతో డిఓటి తేల్చి చెప్పనందున, ఈ ఆప్షన్ అమలులోకి రాలేదు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించి ఈ ఆప్షన్ ను అమలులోకి తేవాలి.


8.    బిఎస్ఎన్ఎల్ లో రిక్రూటయిన ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ అమలులో లేదు. ఈపీఎఫ్ లో భాగముగా వున్న ఈపిఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) వారికి అమలులో వున్నది. టీ బోర్డు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్, పోర్ట్ అండ్ డాక్  తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో రిక్రూట్ అయిన ఉద్యోగులకు సిసిఎస్ (పెన్షన్) రూల్స్ ప్రకారం పెన్షన్ చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ లో రిక్రూట్ అయిన ఉద్యోగులకు  కూడా సిసిఎస్(పెన్షన్) రూల్స్ ప్రకారం పెన్షన్ చెల్లించాలి.



No comments:

Post a Comment